శ్రవణ మనన నిధిధ్యాసలు

ఓం


(audio only)

            అందరికీ నమస్కారము.
            ప్రధానంగా గురుపౌర్ణమి నిర్వహించుకోవడం వెనుక వున్నటువంటి, మొట్టమొదటి వుద్దేశ్యము ఏంటంటే, అసలిది ప్రారంభించటం ఎట్లాచేశారంటే, మనలాగా సంవత్సరానికి ఒకసారి మొహం చూపెట్టేవాళ్ళకోసం పెట్టలేదు. అర్థమైందా అండీ! ఇందులో కొంతమంది, సంవత్సరానికి ఒకసారి మాత్రమే గురువుగారి దర్శనానికి వచ్చే వాళ్ళు కూడా కనపడుతున్నారు. లేదంటే గురువుగారే మిమ్మల్ని చూడడానికి రావల్సిన పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. వాస్తవానికైతే, చాతుర్మాస్య వ్రతాలని సంప్రదాయంలో మనకి వున్నాయి. ఇవాళ్టి నుంచే ఈ చాతుర్మాస్య వ్రతాన్ని అన్ని చోట్ల ప్రారంభిస్తారు. ఆ గురువును దర్శించి నాలుగు నెలలపాటు, వారితో పాటు వుండి, వారు బోధించేటటువంటి విజ్ఞానాన్ని, ఈ నాలుగు నెలలలో, వారితో సహవాసం చేసి నేర్చుకునేటువంటి విధానము ప్రారంభించటం కోసమని, ఈ గురుపౌర్ణమియొక్క విధానాన్ని ప్రవేశపెట్టారు. గురువుగారు 365 రోజులు ఆశ్రమములోనే వున్నప్పటికీ కూడా, ఈ నాలుగునెలలు తప్పనిసరిగా ఎక్కడో ఒకచోట ఆశ్రమములో వుంటారన్నమాట. తాత్కలిక ఆశ్రమంలో కానీ, శాశ్వత ఆశ్రమాలలో కాని. కారణం ఏమిటంటే, అందరికీ అందుబాటులో వుండాలి. పైగా ఈ కాలమంతా కూడా సాధరణంగా వర్షాలు, అలాగే బయిట తిరగడానికి అనుకూలముగా లేనటువంటి, పాదయాత్ర చేయడానికిగానీ, అటువంటి అవకాశాలు తక్కువ వుంటాయి కాబట్టి, స్థిరంగా గురువుగారు దొరికేటటువంటి కాలం, సంవత్సరములో ఈ నాలుగు నెలలు అని ఒక సూచన అన్నమాట అది.

            కాబట్టి, జీవితంలో ఏమైనా సరే, మనం మార్పును సాధించాలి అని నిర్ణయం తీసుకున్నటువంటి శిష్యులందరికి కూడానూ ఈ నాలుగు నెలలపాటు, ఉత్తమమైనటు వంటి తాత్త్విక గ్రంథాలని ప్రవచనం చేస్తారన్నమాట.  అంటే, తెల్లవారు ఝామున నాలుగు గంటలకో, మూడున్నరకో లేపటం, అలాగే వారియొక్క సాధనావిధిని పరిశీలించడం, వారందరిని fine tuning చేయడం, సరైన దారిలో  పెట్టటం. తరువాత, ఏ సాధనపంచకమో లేకపోతే ఏదన్నా మనీషా పంచకమో లేదంటే నిర్వాణషట్కమో, అలాంటిది ఉదయంపూట ప్రవచించటం. ఆ తరువాత పూజాదికములు వగైరాలు, గురుపూజ వగైరాలు పూర్తైన తరువాత, మరల రెండవసారి ఏ భాగవత సారాంశమో లేదంటే ఆధ్యాత్మ రామాయణమో లేదంటే భగవద్గీతో అలాంటివి బోధించడం. సాయంత్రం మరల ఏదైనా ఉపనిషత్‌ గ్రంథాలు, దశోపనిషత్తుల్లో ఏదో ఒక ఉపనిషత్తును గురించి మాట్లాడటం, ప్రవచించడం ఇట్లాగా మరలా రాత్రికి, ఏదైనాగానీ అట్లా నాలుగు ప్రవచనాలు, రోజుకి నాలుగు ప్రవచనాలు వుండేటట్లుగా, ఈ చాతుర్మాస్యవ్రతం ఏర్పరచబడుతుందన్నమాట. అట్లాగే తప్పనిసరిగా ఈ నాలుగు నెలలలో, ఒక తాత్త్విక గ్రంథాన్ని, ఒక తత్త్వజ్ఞాన గ్రంథాన్ని తప్పనిసరిగా పూర్తిచేసేటు వంటి సనాతన సంప్రదాయంలోనుంచి  వచ్చినటువంటి మొట్టమొదటి రోజు గురుపౌర్ణమిఇది.

గురువుగారిని శిష్యులందరూ కలిసి, అయ్యా! ఈ నాలుగు నెలలు తమరు మాకు విజ్ఞానాన్ని బోధించండి. అని వారిని వేడుకునేటటువంటి రోజుగా ఈ గురుపౌర్ణమిని ప్రవేశపెట్టారు. ఇది ఆచారంలో వచ్చినటువంటి విధానము. ఇక మొదట వ్యాసపౌర్ణమి, గురుపౌర్ణమి వగైరాలన్నీ వేదవ్యాసుడి కాలంలో ఏర్పడినటువంటి విధానము. వారిని అనుసరించి జీవించినటువంటివారు, ఆనాటి మహర్షులు పాటించినటువంటి సంప్రదాయం.
ఐతే, మనం సుమారుగా ఇది ఎన్నొవదండీ! మాట్లాడుకోబట్టి 6వదా, 7వదా, 8వదా...10వది. పది సంవత్సరాలలో గమనించిన సందర్భం ఏమిటంటే, మొదటి సంవత్సరాలలో రికార్డర్‌ ఇక్కడ ఒకటే వుండేది, ఇప్పుడు మెల్లగా అక్కడ 50 దాకా వచ్చాయి. కాబట్టి మనం సంఖ్యాబలంలో పెరుగుతున్నామన్నది మాత్రం సుస్పష్టంగా కనపడుతుంది. కానీ నాకు, నేను మొన్న హైదరాబాదు వెళ్ళనప్పుడు కూడా వారందరినీ ప్రశ్నించింది ఒక్కటే. సైన్యాన్ని నడపడనికి అతిరథమహారథులు అనేవాళ్ళు వుండాలి. సైన్యాధ్యక్షులు వుండాలండీ ఎప్పుడూకూడా. సైన్యాధ్యక్షులు లేకుండా సైన్యం నడువదు.

అట్లాగే గురువుగారిని ఆశ్రయించాము అంటే, మొట్టమొదట అందరం ఎట్లా ఆశ్రయిస్తాం? అనుసరించేవాళ్ళుగా ఆశ్రయిస్తాం. అంటే మనకేమీ తెలీదు, వారిదగ్గర కొంత పరిజ్ఞానం నేర్చుకోవడానికి, శాస్త్రజ్ఞానం నేర్చుకోవడానికి, అలా ఆ పరిచయజ్ఞానం పెరుగుతూ, విషయజ్ఞానంగా మారి తరువాత నిజజీవితంలో జీవించే విజ్ఞానంగా మారేటటువంటి దశలోకి ఎదుగుతూ వస్తాం. ఆ క్రమంలో ముందు అనుసరించేవారుగా వుంటాము తదుపరి అనుసరించే వారి స్థాయినుంచి ఎదిగి ప్రాథమికమైనటువంటి ఉపదేశాన్ని పొంది శిష్యులుగా మారుతారు. ఆ శిష్యుడి స్థాయినుంచి మీరు సత్‌శిష్యులైనప్పుడు, మీకు మహావాక్యాలను బోధిస్తారు. మహావాక్యాలు బోధించబడ్డాయి అంటే, మీరు సచ్ఛిష్యులుగా జీవనం సాగిస్తున్నారనేటటువంటి ఒక నిర్ణయం అన్నమాట. అలాగే సచ్ఛిష్యుల స్థాయినుండి కూడా ఎదిగి నిజశిష్యులనిగాని, గురుబిడ్డలనిగాని, గురువుకి పుత్ర సమానమైన, (పుత్రులు, పుత్రిక భేదం వుండదు సుమీ!) ఆ నామరూపాల భేదం లేదు కాబట్టి, శాస్త్రంలో ఎప్పుడూ కొడుకా... !” అనే సంభోదిస్తూ వుంటారు. అంటే దానర్థం మమ్మల్ని వదిలేశారని అనుకోకూడదు. అలా ఆ గురువుకు అతి దగ్గరగా వున్నటువంటి పిల్లవాడుగా అతను మార్పు చెందుతాడన్నమాట. ఇది నిజశిష్యుడు అంటారు, నిజగురువు అంటారు. ఈ స్థాయికి ఎదిగినప్పుడు, ఇంకా ఆ పైన వున్నటువంటి పూర్ణము లేకపోతే ఇంకా ఆ పైన వున్నటువంటి పరబ్రహ్మ-నిర్ణయముఇలాంటి వాటిని బోధిస్తూ వుంటారు.

అయితే క్రమానుగతిశీలంగా మనం గమనించినట్లయితే, ప్రతి సంవత్సరం నిర్వహించేటప్పుడు, ఈ సంవత్సరకాలంలో మీరందరూ చేసినటువంటి, సాధనాపరమైనటువంటి జీవనాన్ని, ఆ సాధనాపరంగా జీవించేటప్పుడు వచ్చినటువంటి సందేహాలని నివృత్తి చేసుకోవడానికి ఈ రెండురోజులు మీకు వినియోగపడితే అదియొక సరియైనటువంటి రీతిగా మనం నిర్వహించుకున్నట్లు అవుతుంది.

            కాబట్టి వచ్చిన వారందరూ ఏమి ఆలోచించాలంటే,
ఎవరి స్థాయిలో వాళ్ళు ఎదుగుతున్నారా? లేదా?
ఈ ఎదుగుదల అనేది చాలా అవసరం. ఉన్నచోటే వున్నారనుకోండి ప్రయోజనము లేదు.

***

సాధారణంగా మనలో పరిణామం దేనితో ప్రారంభం అవుతుంది?
శ్రవణముతో ప్రారంభము అవుతుంది. అంటే వినటంతో ప్రారంభం అవుతుంది. సాధనలని మనం ఎన్నిరకాలుగా లెక్కవేసినప్పటికీ కూడాను శ్రవణ, మనన, నిధిధ్యాసలు అనేవి దరిదాపుగా మీ అందరికీ తెలుసు.
ఇక్కడ నేను నలుగురు ఐదుగురినే కొత్తవాళ్ళను చూస్తున్నా, all most all మిగిలిన వాళ్ళందరూ పాతవాళ్ళే కనపడుతున్నారు.

శ్రవణ, మనన, నిధిధ్యాసలలో శ్రవణం అంటే శ్రద్ధగా శ్రవణం చేయడం. కేవలం విని వెళ్ళటం కాదన్నమాట. అంటే అర్థం ఏమిటంటే, మనం జీవితంలో చాలాపనులు చేస్తాం. ఉదాహరణ చెప్తాను, మీరెప్పుడైనా జీవితంలో సినిమా చూశారా? సినిమా చూడని వాళ్ళెవరైనా వున్నారా ఇక్కడ? ఎవరైనా వున్నారా అండీ? లేదు  all most all. సినిమా చూసిన తరువాత ఇంటికి వచ్చి, dialogue by dialogue, scene by scene ఎవరికైనా చెప్పారా? కుదరదా అలా చెప్పడం? కుదరదా? కుదురుతుందా కుదరదా? కానీ, ఎప్పుడన్నా చెప్పడానికి ట్రై చేశామా? హీరోగారు ఇలా అన్నారు, హీరోయీన్‌ గారు ఇలా అన్నారు, విలన్‌ గారు ఇలా అన్నారు. హీరో తండ్రిగారు ఇలా అన్నారు. ఎలా అయితే రచయిత స్క్రిప్ట్‌ రాస్తాడో? అలా మనం డైరెక్ట్‌గా చెప్పగలమా? సినిమా చూసివచ్చి. చెప్పలేవుగా, సారంశముగా చెప్తావు. అంతేనా? కాదా? కారణమేంటీ అంటే,
అక్కడ మనం వింటున్నాం, చూస్తున్నాం, అవగాహన చేసుకుంటున్నాము. కేవలం దేనిని మిగిల్చుకున్నాం? ఆ సినిమా వలన వచ్చినటువంటి ఆనందానుభూతిని మిగిల్చుకున్నాం, ప్రత్యేకతల్ని గుర్తించాము. సారంశము ఏమన్నా పాఠమేదన్నా వుంటే అది పట్టుకున్నాం.  ఈ మూడు లేకపోతే వెళ్ళామయా, చూశామయా, వచ్చామయా! ఈ మూడే. ఓసారి చూడచ్చు అంటాడు అంతే. ఓసారి చూడచ్చు అంటే అర్థం ఏమిటి? దాంట్లో గ్రహించేదేమీ లేదని అర్థం.

అట్లాగే మనం కూడా గురుపౌర్ణమికి వచ్చామనుకోండి, సినిమా చూడడానికి వెళ్ళొచ్చినట్లుగా, అప్పుడేమైపోతుంది? అంటే అతి తక్కువ మాత్రమే మనం వెనక్కు పట్టుకెళ్తాం అన్నమాట! ఇలాంటి ప్రయోజనం ఎందువల్ల వస్తుందయ్యా? అంటే,శ్రవణంచేసేటప్పుడు మనలో వచ్చినటువంటి దోషం అన్నమాట! ఆ దోషం బుద్ధిలో ఉంటుందన్నమాట.

అందువల్లనే మనలో మనందరం మానవ దేహధారులం అయినప్పటికీ కూడా, మనకు శ్రవణం యొక్క ప్రభావం – దోమల లెక్కన వినపడుతుందా? వినపడదా? దోమలెప్పుడు చెవిలో గుయ్‌ మంటుంటాయా లేదా? అంటుంటాయా? మనం వాటిని ఆనందంగా అనుభవిస్తున్నామా? ఎలా అనుభవిస్తున్నాం? పెద్ద disturbance గా పెద్ద ఇబ్బందిగా అనుభవిస్తున్నాం. కాబట్టి శ్రవణం అలా కూడా వినచ్చు. ఎంట్రాబాబు? ఈ గోలంతా ఏంట్రా నాయనా? 48 గంటల సేపు మమ్మల్ని ఇలా... దోమల వలె శ్రవణం చేసేటటువంటి పరిస్థితి వుండడం. అలా ఒకస్థాయిలో, అది అథమస్థాయి అన్నమాట.

దానికంటే కొద్దిగా బాగుండే స్థాయి శ్రవణం ఏమిటి? సంగీత శ్రవణం. సంగీతం కీర్తనలు వింటామా? వినమా? మనమందరం కీర్తనలు విన్నవాళ్ళందరం బాగా పాడగలమా? పాడలేమా? ఏమండీ? పాటలు విన్నవారందరూ పాడలేరా? మరెందుకు వింటున్నావ్‌? ఆనందం కోసం. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. అర్థమైందా అండీ! బాగా వినాలని మీరంతా బాగా వింటారు. విని మా అందరికీ ఓ certificate ఇస్తారు. బాగా చెప్పారండీ, ఈసారి అని. అర్థమైందా అండీ! నేను దరిదాపు గత రెండు దశాబ్ధాలుగా చూస్తున్నానండి ఈ చెప్పడం, వినడం అనే విషయం. నాకు తెలిసి ఏమిటంటే, మీరందరూ వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు ఒక certificate ఇస్తారు. ఏమిస్తారయ్యా? అంటే, బాగా చెప్పారండీ ఈ సారి మీరు అని. అంటే ఏ సారైనా ఓ సారి బాగా చెప్పలేదా అనే సందేహం మాకు కలుగుతూ వుంటుంది అన్నమాట. So ఇది రెండవ స్థాయి శ్రవణంఅంటే అర్థం ఏమంటే, సంగీతం-కీర్తనలు వినే శ్రవణ స్థాయి అన్నమాట ఇది. అంటే అందరూ వింటారు. సంగీతం విననివారు ఎవరూ వుండరు. ఏదో స్థాయిలో పాటో, పద్యమో, శ్లోకమో వారి వారి స్థాయిని బట్టి వింటారు, ఆనందిస్తారు. పాడమంటే మాత్రం నాకు రాదండీ అని అంటారు. అర్థమైందా అండీ, ఇది ఒక స్థాయి శ్రవణం.

మొదటి శ్రవణం ఏమిటి? 
దోమల స్థాయి శ్రవణం. అది అథమస్థాయి శ్రవణం అన్నమాట. అంటే disturb అయిపోవడం దాని వల్ల. 
కొద్దిగా దానికంటే పరువాలేదు సంగీతం వినడం. దీనికంటే కొంచెం ఉత్తమస్థాయి శ్రవణము ఏమిటి?

మీ ఇంటికి వైదిక కార్యక్రమాల కోసమని బ్రహ్మణుడిని పిలుస్తారా? పిలవరా? అనేక సందర్భాలలో ఏ సత్యనారయణ వ్రతము అనో ఏ పుణ్యాహవచనమనో లేకపోతే ఏ యజ్ఞమో, యాగమో, అభిషేకమోఏదీ లేకపోతే ఎవరైనా చనిపోయినప్పడు పిలవడానికి అపరకర్మకో పిలుస్తారా? పిలవరా? వీళ్ళందరూ బానే మంత్రాలు చదువుతారా? చదవరా?
 కాబట్టి మంత్రాలు వినని వారు వున్నారా ఎవరన్నా? జీవితంలో మంత్రాలు వినని వారు లేరు కదా! మీరు గుడికి వెళ్తారు, గుడిలో మంత్రపుష్పం చెప్తారు. అన్నీ వింటారా? లేదా? మనం ఎప్పుడన్నా చెప్పడానికి Try చేశామా? ఏ? ఎందుకని చెప్పలేదండీ? ఎన్నిసార్లు గుడికి వెళ్ళుంటాం? నాకు తెలిసి జీవితకాలము అదే మంత్రపుష్పము. మన జీవితకాలములో మంత్రపుష్పము ఏమీ మారదు. మీ జీవితకాలంలో కాదు, ఎన్ని వేల సంవత్సరాలైనా మంత్రపుష్పము అదే వుంటుంది, ఏమీ మారదు. ఎప్పుడైనా మనం చెప్పడానికి try చేశామా? [లేదు] ఏ? అది నా పని కాదు. అర్థమైందా అండీ! మనలో బాగా వున్నటువంటి నిర్ణయం ఏమిటంటే? అది నా పని కాదు. ఆయనెవరో పూజారిగారు దేవుడి గుడిలో చెప్పుకుంటున్నాడు అంతే. ఇదొక స్థాయి శ్రవణం అండి. ఈ స్థాయి శ్రవణం వల్ల కూడా ఏమన్నా ప్రయోజనము వుందా? ఏం ప్రయోజనము లేదు.

ఇంకొక స్థాయి శ్రవణము వుందండి, ఇది కాక. రోజు ఇంట్లో మీరందరూ కూడా విష్ణు సహస్రనామాలు, లలితా సహస్రనామాలు ఇప్పుడు గురుపూజలు etc. ఏదైనా చెయ్యనివ్వండి, రోజుకొక ఆరాధన చేస్తారా చేయ్యరా? ఏదో భౌతికంగానో, మానసికంగానో ఏదో స్థాయిలో చేస్తారా? చెయ్యరా? ఈ ఆరాధన కూడా శ్రవణం క్రిందకే వస్తుంది. అవునా? కాదా?  విష్ణు సహస్రనామం CD పెడతారు లేదంటే లలితా సహస్రనామం CD పెడతారు. పెట్టి ఏం చేస్తారు? మీ పని మీరు చేసుకుంటూ వుంటారు. 

ఎప్పుడైనా ఈ విష్ణు సహస్రనామం ఏం చెప్తుంది? లేదా లలితా సహస్రనామం ఏం చెప్తోంది? లేదా భగవద్గీత ఏం చెప్తోంది? దాని అర్థమేమిటి? ఏమన్నా అర్థం పర్థం వుండే చెప్తున్నారా? మనకేమన్నా వుపయోగపడుతుందా? దానినేమన్నా మన నిజజీవితానికి వుపయోగించుకునే అవకాశం ఏమన్నా వుందా? దాని అర్థం తెలుసుకుంటే మనకు అవగాహన పెరుగుతుందా? అనే ప్రశ్నలు ఏమైనా వచ్చినాయా ఎప్పుడైనా? వచ్చినప్పుడు ఏమి చేస్తాం? వాటి అర్థాన్ని విచారణ చేస్తాం.
అంటే విచారణ చేసే స్థాయికి మనకు ప్రశ్నలు వచ్చేట్టుగా వినడం. ఇదొక స్థాయి శ్రవణం అండీ, అంటే శ్రవణం చేసేటప్పుడు మనం ఇన్ని స్థాయిలలో శ్రవణం చేస్తాం.  మీరు ఈ 48 గంటలలో మీరు receive చేసుకునేవన్నీ కూడా ఈ నాలుగు స్థాయిలలో శ్రవణం చేస్తూవుంటారండీ. ఒకటేమిటి దోమల శ్రవణం, ఇంతకంటే అథమస్థాయి వుంది కానీ అది నేను మీకు చెప్పదలచుకోలేదు. అదేమంటే రాళ్ళకు శ్రవణం చేయడం, ఈ building కూడా వింటుంది. కానీ దానికేమీ ప్రయోజనము లేదు. అర్థమైందా అండీ. ఆ అథమస్థాయిలో మనంలేము. కాబట్టి,

కనీసం మనం ఏ స్థాయిలోకి రావాలి వినేకొద్దీ? ఏదైనా విన్నప్పుడు ఆ విన్నదాని యొక్క (అవగాహన చేసుకోవడానికి) అర్థం ఏమిటి? [మనం మాట్లేడటప్పుడు] బుద్ధి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడిక్కడ ఎవరైనా మళయాళంలో గాని అరవంలో గానీ మాట్లాడారు అనుకోండి, అప్పుడు మీకు అర్థం అవుతుందా? [అర్థం కాదు] ఏం? ఆ భాష పరిచయం లేదు కాబట్టి. ఒక్క వాక్యంలో ప్రధానమైనటువంటి శబ్దాలు ఏవైనా మనకు తెలియనటు వంటి శబ్దాలు ప్రయోగించబడినాయి అనుకోండి, ఆ వాక్యం యొక్క సారాంశాన్ని మన బుద్ధి పట్టించుకోదు ఇక. ఇది నాకు తెలియదుఅన్నదాంట్లోకి తోసేస్తుంది. మన computer లో అంటారు, ఏమంటారు దానిని Recycle Bin లోకి తోసేస్తుందన్నమాట. అందులో వుంటుంది, నువ్వు ప్రయోగం చేసి, ప్రయత్నం చేసి, విచారణ చేస్తే మళ్ళా వస్తుంది. తెచ్చుకోవచ్చు. ఇంకా నువ్వు ప్రయత్నం చేయలేదనుకోండి, కొంతకాలం తరువాత ఏం చేస్తుంది? ఇది నీకు అవసరం లేదని తోసేస్తుంది బయటకి. మరుగులోకి వెళ్ళిపోతుంది. ఇందువల్లనే, మనం అనేక సంవత్సరాలపాటు శ్రవణం చేయవలసిన అగత్యం ఏర్పడుతున్నది. అసలు ఈ నాలుగుస్థాయిల కంటే కూడా ఉత్తమస్థాయి శ్రవణం ఒకటుంది. ఏమిటయ్యా! అంటే,

విన్నది విన్నట్లు యథాతథముగా ఉపదేశకాలంలోనే దర్శనాన్ని పొందగలిగే సమర్థతతో శ్రవణం చేయటం.

ఇది ఉత్తమస్థాయి శ్రవణం అంటే అర్థమేమిటి? మీకు ఏదైతే ఉపదేశం, మంత్రోపదేశం గాని, బోధ గాని చెప్తున్నారో, చెప్తున్నది చెప్తున్నట్లే, చెప్పిన ఏ స్థితిలో వుందో ఆ స్థితికి సంబంధించినటువంటి యథార్థ దర్శనానుభూతి కలగడం. ఈ స్థాయిలో వున్న వాళ్ళ యొక్క శ్రవణం, సచ్ఛిష్యులన్నమాట వీళ్ళు. ఎప్పటికైనా ఈ స్థాయిని అందుకోవాలి మనం. ఈ స్థాయిని అందుకుంటేనే బ్రహ్మవిద్య సాధ్యమౌతుంది. ఇది బాగా గుర్తు పెట్టుకోండి. అంతేగాని, మనం వినేసి ఇంటికి వెళ్ళి normal గా మన జీవితం జీవిస్తూ, ఎప్పుడో ఒకప్పుడు గుర్తొచ్చినప్పుడు ఎప్పుడో కొద్దిగా ప్రయత్నం చేద్దాంలే అని అనుకుంటే, అప్పుడు మనం సరిగా సరిపోమన్నమాట ఈ విద్యకి. అట్లాగే ఇది శ్రవణానికి సంబంధించిన తరగతి.

ఇహ ఇందులోనుంచి మనన నిధిధ్యాసలలోకి ఎప్పుడొస్తారు? శ్రవణంలోనుంచే కదా మనన నిధిధ్యాసలలోకి ఎదగాలి. ఇప్పుడు మననం చేయమంటే అందరూ ఏం చేస్తున్నారయ్యా అంటే, నేను మిమ్మల్నందరిని గమనించి status report చెప్తున్నా. తరువాత బోధించేవాళ్ళందరూ మిమ్మల్ని ఎలా మార్చాలో ప్రయత్నం చేస్తారు.
మననం అంటే ఈ record లు ఏవో పెడతారు, మీరందరూ record చేసుకుంటున్నారా లేదా? ఇవి కాక మీ phone లలో వింటున్నారు. రకరకాలుగా విషయసంగ్రహణ చేస్తున్నారు. చేసిందాన్ని ఏం చేస్తారు? అది on చేస్తారు. ఏ ear phone పెట్టుకునో లేకపోతే ఇంకోరకంగానో పెట్టుకునో వింటారు. మళ్ళా  శ్రవణం ఇప్పుడేమైంది? మననంఅయ్యిందా? మరళా శ్రవణమే repeat అయ్యింది. రోజూ వినటం మననం అని అనుకుంటున్నారు. అది ఎప్పటికీ మననం కాదు. రోజూ ఉపన్యాసాలు వింటున్నామాండీ, రోజూ చదువుతున్నామండీ, ఈ రోజూ’ ‘శ్రవణం క్రియ కిందకే వస్తుంది కానీ మననం క్రిందకి రాదు. మననం క్రిందకి రావాలి అంటే ఏం చేయాలి?

అసలు మననంఅంటే ఏమిటి? ఏం చేస్తే మననం అవుతుంది? అదే అనుకుంటూ వుండాలా?
విచారణ చేయాలి.
విచారణ చేస్తే మననంఅవుతుందా?                                         
ఆచరణ చేయాలి.
ఆచరణ చేస్తే మననం అవుతుందా?

మనన-స్థాయిఅంటే ఏమిటయ్యా? అంటే, బాగా గుర్తుపెట్టుకోండి, మీరేదన్నా విష్ణుసహస్రనామం చదివారు అనుకోండి, ఆ సహస్రనామాలలో ఏదో ఒక నామం మీలో నిలబడి పోవాలి. నిలబడి పోయింది మరలా మీరు విష్ణుసహస్రనామం చదివే వరకు దానంతటది అప్రయత్నంగా మిమ్మల్ని వెంబడించాలి. లోపల మీ ప్రయత్నం అవసరం లేదు, అదే మిమ్మల్ని వెంబడిస్తూ వుంటుంది. అలా దానంతటదే జరుగుతూ వుంటుందన్నమాట. అట్లా రోజుకు ఒక నామం మనతో పాటు అట్లా జరుగుతూ వుంటే, ఆ స్థితిని మనం అనుభవించే అవకాశం వస్తుందన్నమాట. అట్లాగే కేవలం విష్ణుసహస్రనామం, లలితా సహస్రనామం, సంస్కృత శబ్దాలు, శ్లోకాలు కాదు అని నా వుద్దేశ్యము. మీకు ఇవ్వబడిన ఉపదేశ మంత్రం అయినా, లేదంటే మీరు విన్నటువంటి గురువాక్యమైనా, లేదంటే మీరు ఆచరించడానికి తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించిన వేదాంత వాక్యమైనా, శాస్త్ర వాక్యమైనా, కొంతమందికి అనన్యాః చింతయంతో మాంఅనేటువంటి శ్లోకం బాగా పడుతుంది. అది వారి రోజువారి జీవితంలో నిత్యం మననం జరిగిపోతూ వుంటుంది. నేను ఎప్పుడు భగవంతుని కంటే భిన్నంగా లేను – అనేటువంటి అవగాహన లోపల పట్టుకుంటుందన్నమాట. అట్లా ఎవరికైనా మీ సంస్కార బలాన్ని బట్టి, మీ సమర్థతను బట్టి, మీ అవసరాన్ని బట్టి, శాస్త్రంలో వున్న వాక్యాలని, గురువువద్దబోధలో వున్న వాక్యాలని ఎంపిక చేసుకుంటారు. ఆ ఎంపిక చేసుకున్న వాక్యం మిమ్మల్ని వెంబడిస్తూ వుండాలి. మీతో పాటు జీవితంలో అది వుండాలన్నమాట. ఎప్పుడైతే అప్రయత్నంగా మీ లోపల అది పనిచేస్తూ వుంటుందో, అప్పుడు మీరు శ్రవణ స్థాయి నుంచి ఎక్కడికి ఎదిగినట్లు? మనన స్థాయికి ఎదిగినట్లు.


మననం నుంచి నిధిఅవ్వాలంటే ఏమవ్వాలండీ? మననం నుంచి నిధి అవ్వాలంటే ఏం చేయాలి? ఎట్లా? ఎప్పుడు అయినట్లు తెలుస్తుంది మనకు? అంటే మన ప్రోగ్రామ్‌ మనకే తెలియాలా వద్దా? ఎందుకంటే ఇందులో కొంతమంది సీనియర్లు 12 యేండ్ల నుంచి 13 యేండ్ల నుంచి 20ఏళ్ళనుంచి నాతోపాటుగా వున్నవాళ్ళు కూడా వున్నారు. అర్థమైందా అండీ, మనం ఏ స్థాయిలో వున్నామో? మనకు మనమే ఒక అవగాహన వుండాలి. అవగాహన లేదనుకోండి, మరలా మొదటనుంచి మొదలు పెట్టాల్సిందే అఆ..లు నుంచి అర్థమైందా? కాబట్టి శ్రవణం నుంచి మననంలోకి రావడం అంటే అర్థం ఏమిటి? మనం ఎన్నో వందల, వేల, లక్షల వాక్యాలను వింటూ వుంటాం. గ్రహిస్తూ వుంటాం, తెలుసుకుంటూ వుంటాం. ఇందులో నీ జీవితానికి సరిపడినటువంటి ఒక్క పదివాక్యాలు ఎంపిక చేసుకుని, జీవితానికి సంబంధించినటువంటి ఆచరణలో వాటిని మనం నడుపుకోగలిగేటటువంటి స్థితిలో, అవి మనలో జీర్ణం అయిపోయి మననం జరుగుతూ వుండాలన్నమాట. అది మననస్థాయి.

ఇక నిధి అంటే చెప్తారా ఎవరన్నా?
నిధిఅంటే ఏమిటంటే? నిద్రలో కూడా నీకది పనిచేయాలి. నిద్రలో కూడా పనిచేస్తే అది నిధి అయిపోతుంది ఇక. నిధి అంటే ఏమిటసలు? ఎందుకు అలా పెట్టారు నిధి అని? మీ ముత్తాతగారు మీ ఇంటిగోడలో లంకెబిందెలు పాతి పెట్టారు. అర్థమైందా అండీ, అది మీకు ఎక్కడో ఒక వీలునామాలో వ్రాశాడు. నీ భవిష్యత్తంతా మీ ఇంట్లోనే వుంది అని. ఏమిటో అర్థం కాలేదు. నా భవిష్యత్తంతా ఇంట్లో వుండటం ఏమిటి? ఇల్లు బాగానే కనపడుతుంది కదా! అనుకున్నాడట. కొంతకాలం తరువాత మూడుతరాలు, నాలుగు తరాలు అయ్యేటప్పటికి ఇల్లు పాడైపోతుందా? పాడైపోదా? మళ్ళా పునాదులతో సహా తీసేసి, మళ్ళా ఇళ్ళు కడదామని అనుకున్నాడట. పునాదులతో సహా ఇల్లు తీసేసేటప్పటికి ఏమైందీ? అవి దొరికినాయి. ఓహో! “ఇదా, నా భవిష్యత్తు అని అర్థమైంది. అర్థమైందా అండీ! దీనిలో వున్న సారాంశం ఏమిటి? మీ ముత్తాతగారు ఇచ్చినటువంటి నిధి, శరీరం అనే ఇంటి లోపల వుంది.

దేహమనే ఇంటిలోపల దేహి అనే నిధి వున్నదన్నమాట.

దేహి అనే నిధిని ఎవరైతే గాఢనిద్రావస్థలో కూడా గుర్తించగలుగుతున్నారో, దేహిని ఎక్కడ గుర్తించాలట ఇప్పడు విచారణ చేసే కాలంలో కాదు, గాఢ నిద్రావస్థలో కూడా, ఈ నిద్రను నేను అనుభవించడం లేదు. ఈ నిద్రకు సాక్షిని నేను. అనేటటువంటి నిర్ణయాన్ని పొందినటువంటి వాళ్ళెవరైతే వున్నారో, వాళ్ళు నిధిదశలో వున్నట్లు. ఇది గుర్తు దానికి. అర్థమైందా అండీ! మెలకువ, కలలో నిన్ను వెంబడిస్తేనేమో మననం, అర్థమైందా? కేవలం మెలకువలో మాత్రమే, విచారణ కాలంలో మాత్రమే పనిచేస్తూ వుంటే శ్రవణం. మెలకువ, కలలో పనిచేస్తే మననం. గాఢనిద్రావస్థలో కూడా పనిచేస్తే నిధి’. 

మరి ధ్యాసఅంటే? ధ్యాసఅంటే అర్థం ఏమిటంటే?
ఆత్మసాక్షాత్కార అనుభూతి చేత ఏ నిర్ణయమైతే నువ్వు పొందుతున్నావో అదిధ్యాస. ఇక రెండవది కనపడదని అర్థం. సహజమైపోవడం- ఎప్పుడౌతావు సహజం? రెండవది కనపడనప్పుడు. తనకు అన్యమైనది తోచనప్పుడు ఏ ధ్యాసలో వున్నాడంటాం? అర్థమైందా? 

పిల్లాడు ఎప్పుడూ ఆడుకుంటాడా? లేదా? రెండేళ్ళ పిల్లవాడు మేలుకున్నాడండీ, ఏం చేస్తాడు? ఆడుకుంటాడు, అంతేనా కాదా? ఇప్పుడు వాడికి తన తల్లి తండ్రితో ఏమన్నా పనుందా? ఏం పని లేదు కదా! అంతేనా? కాదా? ఇప్పుడు వాడేం చేస్తున్నాడండీ? అని అడుగుతారనుకోండి ఎవరైనా? ఏమంటారు? ఆడుకుంటూ వున్నాడు. ఇప్పుడు వాడికి ఆట అనే ధ్యాసను ఎవరు నేర్పారు? స్వతః సిద్ధంగా అతనిలో వచ్చినటువంటి ప్రేరణ చేత, వాడిలో వున్న జ్ఞానం చేత. వాడికి వాడికే స్వతః సిద్ధంగా వున్న జ్ఞానంచేత, వికాసం పొందలానే తపనచేత ఆడుకున్నాడు వాడు. ఆ వికాసం పొందాలనే తపన లేకపోతేనేమో మానసిక వికలాంగులైపోతారు. ఆ వికాసం పొందాలనే తపన వాడిలో నిరంతరాయంగా పనిచేస్తోంది. వాడు నిద్రపోయినా కాళ్ళు, చేతులు కొట్టుకోవడం మానడు. అర్థమైందా! కొట్టుకుంటాడా? లేదా? ఉయ్యాల్లో వేసినప్పుడు ఏం చేస్తాడు? కాళ్ళు చేతులు కొట్టుకుంటాడు. ఆ వికాసం పొందాలనే తీవ్రమైన తపన, తీవ్రమైన జ్ఞానం, తీవ్రమైన అపేక్ష, తీవ్రమైన ఆకాంక్ష వాడిని మూడవస్థలలలో కాదు, వాడా వికాసం పొందే వరకు ఆగడు వాడు. అవునా? కాదా? ఎప్పటివరకూ ఆపడు, ఆ విజ్ఞానాన్ని పొందడం, వికాసం పూర్తైపోయిందనే వరకూ ఆ ప్రక్రియను ఆపడిక. ఇట్లా తనకన్యము తోచని స్థితిలో నీవు ఎప్పుడైతే వుంటావో, అప్పుడేమయ్యాడు? అదే ధ్యాసఅయిపోయాడు. అర్థమైందా అండీ?
కాబట్టి శ్రవణ, మనన, నిధి, ధ్యాస ఈ నాలుగు మన జీవితంతో బాగా ముడివేసుకున్నటువంటి సాధనలన్నమాట. అందుకే శాస్త్రమంతా కూడా అన్ని సాధనల్ని ఈ శ్రవణ, మనన, నిధి-ధ్యాసలకి ముడిపెట్టి చెప్తూ వుంది. అద్వైతానుభూతికి సిద్ధం అయ్యేంత వరకు, ఆ సిద్ధిదశను అందుకునేంత వరకు, ఈ నాలుగు పరిణామ దశలు చాలా ముఖ్యమైనటు వంటివి. ఇవి ప్రతి ఒక్కరూ మీ రోజువారీ జీవితంలో మీరు ఏ సాధనైనా చేయండి, మీరేదైనా నేర్చుకోండి. ఏదైనా అభ్యాసమైనా చేయండి. ఏ దశలో వున్నారో పరిశీలించుకుంటూ వుండాలి.

ఇక ఇందాక ఎవరో అన్నారు. కృప’- అంటే ఏమిటి? అని అడుగుతున్నారు. కృపఅంటే ఏమీ లేదండీ! పిల్లవాడు ఆట ఆడుకుంటూ, ఆటబొమ్మ పట్టుకుని గోడదాక వెళ్ళాడు. గోడదాక వెళ్ళిన పెద్దమనిషి ఆ బొమ్మను అటు నడిపించడానికి Try చేస్తాడు. ఏమౌతుంది? గోడ అడ్డం వచ్చింది. వాడు ఏడుస్తాడు. వాడికేం చేతనవ్వు? ఆటాడటం చేతనవ్వు, అడ్డం వస్తే ఏడ్వడం చేతనవ్వు. ఏడ్చినప్పుడు ఏం చేశాడు? వెనక్కు తిరిగి చూస్తాడు. ఎవరివైపు చూస్తాడు? ఆ వెనకాల ఎవరో వుంటారు, తల్లో, తండ్రో, ఆ వెనకాల ఎవరో తాతయ్యో, అమ్మమ్మో ఎవరో వుంటారు. వాడిని పర్యవేక్షించేవాళ్ళు ఎవరో ఒకరు వుంటారు. వుంటారా? వుండరా? ఆ వెనక్కు తిరిగి చూస్తాడు. వెనక్కు తిరిగి చూస్తే వాళ్ళు ఏమంటారు? ఒరేయ్‌ ! అటు వెళ్ళద్దురా గోడ అడ్డం వచ్చింది, ఇటు తిరిగి వచ్చేయ్‌ అంటారు. వాడికి అర్థం అవుతుందా? అర్థం కాదు కదా! అప్పుడు మళ్ళా ఏడుస్తాడు వాడు. మళ్ళా ఏడిస్తే ఏమి చెయ్యాలి? ఇహ వీడికి ఎంత చెప్పినా బుర్రకి ఎక్కడం లేదని, వాళ్ళే వున్న స్థితి నుంచి, అక్కడకు గోడ దగ్గరకు వచ్చి, వాడిని ఎత్తుకుని ఆటబొమ్మతో సహా తెస్తే, ఏం చేస్తాడు వీడు, మళ్ళా ఆ ఆటబొమ్మ పట్టుకుని మళ్ళా ఆ గోడదాక పోతాడు. అర్థమైందా? మళ్ళా అక్కడకు పోయి ఏం చేస్తాడు? మళ్ళా ఏడుస్తాడు. వీడిని ఏం చేయాలి ఇప్పుడు? మళ్ళా తీసుకురావాలి. వాడికది కదలదు, అటువెళ్ళకూడదు అని తెలిసేవరకూ ఈ పని చేస్తూనే వుండాలి. అవునా కాదా? వాడి పని ఏడ్వడం మాత్రమే.

            ఇలా నీ స్థితిలో నువ్వు వుండి, అధిగమించ లేనటువంటి పరిస్థితి వచ్చినప్పుడల్లా, నీవు ఆర్తితో వేడుకుంటూ వుంటే, ఎవరెవరైతే వచ్చి నిన్ను ఎత్తుకుని మళ్ళా వెనక్కు తీసుకువచ్చి, మరలా నిన్ను ముందుకు నడిపిస్తూ వుంటారో, ఆ వికాసం వచ్చేట్లు చేస్తూ వుంటారో, ఈ చేసే విధానం పేరు కృప.  

            తల్లీ, తండ్రీ ఎలా అయితే ఆ పిల్లవాడియొక్క విజ్ఞాన వికాసానికి, అడగక పోయినా, వాడికేమీ తెలియదని తెలుసుకుని, వాడి అజ్ఞానావస్థను పోగొట్టడానికి ఎలా అయితే నిజజీవితంలో ప్రయత్నం చేస్తున్నారో, అదే విధంగా నీలో వున్నటు వంటి అజ్ఞానాన్ని పోగొట్టి, తత్త్వజ్ఞాన స్థితిలో నీవు స్థిరంగా సహజంగా ధ్యాస’ – శ్రవణ, మనన, నిధి ధ్యాసలలో నువ్వు కుదురుకుని నువ్వు ఉత్తమస్థాయికి పరిణామం చెందేటట్లుగా, నీకు ఎవరెవరైతే సహాయం చేస్తున్నారో, వారికే కారణం వుండదండి. అవ్యాజకరుణామూర్తులు అంటారు వీళ్ళని. వాళ్ళకేమీ కారణం వుండదు, ఆ కరుణకు కారణం వుండదు. దయకు కారణము వుండదు.  వాళ్ళకేమీ స్వార్థ, స్వలాభ, అపేక్షలతో పని లేదు. అలా ఎప్పుడైతే వాళ్ళు నీమీద ఆ కృపను చూపెడుతారో, అప్పుడు ఆయా స్థితులలో, నువ్వు వాటిని అధిగమించేటటువంటి అవకాశం వస్తుందన్నమాట. ఇది కృప  అంటే. ఇక,

గురువు’’ అంటే ఏమిటి? ఎవరిని గురువుగా పట్టుకోవాలి?
గుర్తు చెప్పగలిగినవాడే గురువు ఇది బాగా గుర్తుపెట్టుకోండి.    
గురువు ఎవరయ్యా?
గుర్తు చెప్పగలిగిన వాడెవడో వాడే గురువు.
గుర్తు దేని గురించి చెప్తారు?
గుర్తు గురిని గురించి చెప్తారు.
గురి, గుర్తు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అంటే సంస్కృతంలో కూడా చెప్పవచ్చు. కానీ నోరుతిరగవు, మనకు అందుబాటులో లేదని ఆ భాషను అవలంబించడం లేదు.
గురి, గుర్తు దీనినే మీకు లక్ష్యము, లక్షణము.
సంస్కృతములో చెప్పాలంటే ఏమిటి? లక్ష్యము’ ‘లక్షణము. తెలుగులో చెప్తే గురి  ‘గుర్తు. ఈ గురి’, ‘గుర్తు యొక్క సంగతి నీకు మర్మం లేకుండా తెలియజెప్పేవాళ్ళు ఎవరైతే వుంటారో వాళ్ళు గురువులు. కాబట్టి నీకు తెలియాలి మొట్టమొదట.

 •  అసలు నీ ప్రయాణం ఎటు జరగాలి?
 •  నీ జీవితానికి లక్ష్యం ఏమిటి?
 • ఆ లక్ష్యాన్ని సాధింప చేసుకోవడానికి, సిద్ధింప చేసుకోవడానికి ఈ జన్మలో నాకు ఎంతవరకు పరిణామము వచ్చింది?
 •  ఎలా ఆ పరిణామాన్ని కడతేర్చుకోవాలి?
 •  ఇది మళ్ళా వచ్చే జన్మకు మిగిల్చుకోవాలా? తగల్చుకోవాలా?
 •  ఈ జన్మకే వదిలించుకోవాలా?
 •  లేదంటే జీవన్ముక్తావస్థ స్థితి వరకూ సరిపెట్టుకోవాలా?
 •  లేకపోతే వ్యవహారిక విద్యవరికే సరిపెట్టుకోవాలా?
 •  రోజువారీ ఆనందంగా వుంటే కారణం దగ్గరికి ఆగిపోదామా?
 •  లేదంటే విషయసమత్వం దాక ఆగిపోదామా?
 • లేదంటే మిగితావాళ్ళను పోల్చిచూసుకుంటే, నాకు మిగితావాళ్ళకంటే బాగానే తెలుసు, మిగిలిన వాళ్ళతో పోల్చిచూసుకుంటే నేను సుఖంగానే వున్నాను. అక్కడివరకు ఆగిపోదామా?

            ఎక్కడికి ఆగిపోదామనేది, మీ సంతృప్తిని బట్టే ఆధారపడి వుంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. సంతృప్తి’- అనేది మీరు నేర్చుకునే పుస్తకాలను బట్టి వుండదు. వుంటుందా? మీలో అందరూ కూడాను ఇవాళ రెండు ఇడ్లీ తిన్నారా? మూడు ఇడ్లీ తిన్నారా? ఒకటే ఇడ్లీ తిన్నారా? రెండు ఇడ్లీ ఒక గారె తిన్నారా? ఎన్ని తింటే సంతృప్తి పడ్డారు? లోపలికి enter అయ్యే ముందు ఏదైనా preplan చేసుకుని enter అయ్యారా? ఇవాళ ఏమైనా సరే గురువుగారు ఇడ్లీ, గారె పెడతారు కాబట్టి, దాని సంగతి ఏదో పట్టు పట్టి అటో ఇటో తోద్దాం.  రాలేదుగా. అక్కడికి వెళ్ళారు టిఫిన్‌ చేసే దగ్గరికి. కళ్ళెదురుగుండా కనపడింది. కనపడింది ఎంత తింటే సంతృప్తో ఆ క్షణంలోనే మన అనుభవజ్ఞానం చేత, రోజూ భోజనం చేస్తూనే వున్నాంగా. మన పొట్ట లోపల ఎంత పడుతుంది, ఎంత తినగలగుతాం, ఎంతైతే మనకి తెలివి బాగా పనిచేస్తుంది? ఇలాంటి వన్నీ మనకి అవగాహన వున్నాయి కాబట్టి మనం అక్కడి వెళ్ళగానే ఏం చేశాం? ఆ స్థితిని బట్టి నిర్ణయం తీసుకున్నాం. నిర్ణయం తీసుకుని, అమలు చేశాం. అమలు చేయడం ద్వారా సంతృప్తి వచ్చిందా? అసంతృప్తి వచ్చిందా? అసంతృప్తి’- అని వచ్చిందంటే టిఫెన్‌ menu మళ్ళీ మార్చాలన్నమాట. సంతృప్తి- ఆ సంతృప్తి స్థితి ఎప్పుడైతే వచ్చిందో, అప్పుడు మనం ఆపేశామా? ఆపేయలేదా? అంతేనా? మరలా ఎప్పుడు వెళ్తాం ఆ టేబుల్‌ దగ్గరికి? మళ్ళా ఆకలి వేస్తేనే. కాబట్టి, గురుశిష్యుల సంబంధం కూడా ఇదే సంబంధం.
            నీవు సంతృప్తి చెందితే, ఆ సంతృప్తి చెందిన స్థితిలో నీ జీవితాన్ని నీవు జీవిస్తూ వుంటావు. మరలా ఎప్పుడు వస్తావ్‌? బాధ కలిగితే వస్తావు అంతే. అంతేగానీ, ఎప్పుడు నీ వెంబడబడి చెవిలో జోరీగ లాగా చెప్తూ వుండడం సాధ్యమౌతుందా? సాధ్యం కాదు. కాబట్టి మీ మీ ఆకలిని బట్టి, మీ మీ ఆర్తిని బట్టి, మీ జ్ఞానతృష్ణను బట్టి, మనం ఎంత నేర్చుకోవాలి, ఏం చేయ్యాలి? ఈ పరిశోధన, ఈ అధ్యయనం, ఈ అధ్యాపనం – వీటిల్లో ఏమున్నాయండీ? తత్త్వజ్ఞానంలో... మూడున్నాయి.

1.       పరిశోధన, 2. అధ్యయనం, 3. అధ్యాపనం

మొదటి దశలో పరిశోధనా స్థితిలో వుంటాం అన్నమాట. అక్కడ ఎలా వున్నాం? శ్రవణంచేస్తూ వుంటాం. విన్నది మనం అక్కడే వదిలేస్తామా? వదిలెయ్యం. ఆ శాస్త్రంలో ఏమి చెప్పారు? ఈ శాస్త్రంలో ఏమి చెప్పారు? ఆ గురువుగారు ఏం చెప్పారు? ఈ గురువుగారు ఏం చెప్పారు? ఆ సంప్రదాయంలో ఏం చెప్పారు? ఈ సంప్రదాయంలో ఏం చెప్పారు? ఆ పద్ధతిలో ఆయనేం చెప్పాడు? ఇట్లా పరిశోధన అంతా చేస్తాం. ఇది పరిశోధన
తరువాత ఏం చేస్తాం, వాటిలో మనకు సరిపోయినవి ఏవో ఏరుకుంటాం. ఏరుకుని ఆ ఏరుకున్న వాటిని నిజజీవితానికి దగ్గరగా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. అలా దగ్గరగా తీసుకురావడానికి పేరు అధ్యయనం. ఆ అధ్యయనం చేసేకొద్దీ మనలో సమర్ధత పెరుగుతుంది. నిజజీవితంలో ఆచరించే కొద్దీ మనలో సమర్ధత పెరుగుతుంది. ఇతరులకు సహాయం చేయక వుండలేని దశ వచ్చేస్తుంది. ఈ అధ్యయన సామర్ధ్యం  ఎంతగా పెరిగిపోతుందయ్యా అంటే, ఇతరులకు సహాయం చేయకుండా వుండలేనంత స్థితికి వచ్చేస్తావు. అంటే ఏమిటర్థం.

తండ్రిని పిల్లలు అడుగుతారా? లేదా? మాకీ పని కావాలి, మాకు ఆ పని కావాలి అని సహాయము చేయమని అడుగుతారా? లేదా తండ్రే చేస్తాడా? 
ఈ రెండిటిలో ఏది కరెక్టు? 
(రెండూ కరెక్టేనంట).

తండ్రిని అడిగితే సహాయం చేస్తాడా? అడగకుండానే సహాయం చేస్తాడా?
అడగకుండానే సహాయం చేస్తాడటండీ!
తల్లులందరూ చెప్తున్నమాట అది. 

తండ్రులు మాత్రం ఒప్పుకోవడం లేదండోయ్‌.

తల్లులు సహాయం ఎలా చేస్తారు? అడిగితే చేస్తారా? అడగకుండానే చేస్తారా?
అడగకుండానే సహాయం చేస్తారు. చూడండి, ఏకగ్రీవంగా ఒప్పేసుకున్నారు, అడగకుండానే సహాయం చేస్తారని. Both Parties ఒప్పుకున్నారండీ! కాబట్టి

            మనలో ఆ అధ్యయనం వల్ల, నిజ జీవితంలో జీవించడం వల్ల, మనలో ఎంత సమర్ధత పెరుగుతుందంటే జగత్తుకి జననీ జనకులైనటువంటి పార్వతి పరమేశ్వరుల ఇద్దరి శక్తులు మనలో ప్రవేశిస్తాయి. అందువల్ల ఏమౌతావ్‌? నువ్వు ఎవరైనా ఆ అవసరం వున్నవాళ్ళు జీవితంలో తారసపడ్డప్పుడు, అడగకుండానే సహాయం చేసే తల్లి ముందు పనిచేస్తుంది. తరువాత తండ్రి వలె పనిచేస్తాడు. అడిగితే గాని సహాయం చేయడు. నిన్ను దారిలో పెట్టేంత వరకు, నువ్వు ఒక స్థాయికి వచ్చేంత వరకు, తల్లి వలె సహాయం చేస్తాడు గురువు. తరువాత ఏం చేస్తాడు? అడిగితేనే చెప్తాడు. తండ్రివలె. అయితే,

            కష్టకాలంలో తల్లి సహాయపడుతుందా? తండ్రి సహాయపడుతాడా? తీవ్రమైన కష్టం వచ్చింది, అప్పుడు తల్లి కావాలా? తండ్రి కావాలా? (ఇద్దరూ కావాలా?) తీవ్రమైన కష్టంలోనుంచి బయటపడవేయాలండి, ఏం చేస్తారు?  భిన్నాభిప్రాయాలు వచ్చేసినాయి అంటే ఏమిటి? మనం ఇంకా ఆ స్థాయికి ఎదగలేదన్నమాట. అందుకనే భిన్న అభిప్రాయాలు వచ్చినాయి. అసలు ఏమిటంటే, ముందు కష్టంలో వున్నవాడిని ఏమిచేయాలి? ఓదార్చాలి. అంతేనా?కాదా? Useless fellow get out అంటే? పని జరగదు. కాబట్టి, నీ స్వయంకృత అపరాధం వల్లే అట్లా అయ్యింది, నేనేం చెయ్యలేను పో, అంటే ఏమౌతాడు వాడు? బాగుపడడు కదా! కాబట్టి ఏం చెయ్యాలి మరి? ఓదార్చాలి. 

            కాబట్టి గురువు దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళకి, ఈ ఓదార్పు వాక్యాలను ఎలా చెప్తారయ్యా అంటే, ఆప్తవాక్యాలు ద్వారా చెప్తారు. కాబట్టి మీరు అధ్యయనం చేసేటప్పుడు, పరిశోధన చేసేటప్పుడు, మీ దగ్గర వుండవలసిన వాక్యాలన్నీ కూడా ఎలా వుంటాయంటే- సూచన వాక్యాలు కొన్ని- అంటే లక్ష్యాన్ని గురించి చెప్పేటటువంటి సూచనవాక్యాలు కొన్ని. తరువాత ఏం చేస్తారు, వాటిని మీకు అర్థమయ్యే భాషలోకి, మీకు అర్థమయ్యేటటువంటి జీవన విధానంలోకి, మార్చిచెపుతూ వుంటారన్నమాట. అలా ఒక్కొక్కరొస్తే ఒక్కొక్కరి తీరుగా చెప్తారు. నీ సంస్కార బలాన్ని బట్టి, నీ అవగాహనా సామార్థ్యాన్ని బట్టి, వస్తువు అదే, లక్ష్యమదే, విద్య అదే, జ్ఞానమదే కానీ నీ స్థితిని బట్టి మార్చి చెబుతారన్నమాట!       అట్లా ఆ చెప్పే విధానంలో ఇదొక విధానం అన్నమాట. వీటినేమంటారు? బోధావాక్యాలు అంటారు.

            సూచన వాక్యాలు, బోధావాక్యాలు – సూచన చేసే లక్ష్యం మారదు కానీ బోధించేటప్పుడు శైలిమారుతున్నదన్నమాట. మీరు కూడా మీ దగ్గర వున్న పిల్లలందరికీ ఒక్కటే తీరుగా చెప్తారా? మీ ఆకాంక్ష ఒక్కటే, పిల్లల యొక్క క్షేమమే. కానీ ఎవరికి చెప్పాల్సింది వాళ్ళకి చెప్తారు. అలాగే శిష్యులకు కూడా, వారి వారి స్థితిని బట్టి, వారి సంస్కారాలని బట్టి చెప్తారన్నమాట అది బోధ.

            ఇకపోతే 3వ స్థాయి వుందన్నమాట. అవి ఏమిటి? ఆప్తవాక్యాలు. ఆప్తవాక్యాలు అంటే ఏమిటి? ఓదార్పు వాక్యాలన్నమాట! బాగా కష్టంలో వుండి వస్తామనుకోండి, నువ్వు అర్జెంటుగా ఎండలో 24 గంటలు నిలబడు, తరువాత నీకు పాఠం చెబుతా పో! అన్నామనుకో? ఏమౌతుంది? ఈయనెక్కడ దొరికాడురా బాబు, మళ్ళా ఈయన దగ్గరకు వస్తే ప్రమాదం, అందుకని అటునుంచి అటే పోతారు. అట్లా చెప్పకూడదు ఎవరికైనా సరే, ఏదైనా మీరు సలహా, సూచన నిజజీవితంలో చెప్పేటటువంటి మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ఈ ఆప్తవాక్యం క్రిందికే వస్తుంది. మీ ఇంట్లో కుటుంబసభ్యులుకానీ మీరు ఏ మనుషులతోనైనా మాట్లాడండి, 
వాళ్ళందరూ మీకు ఎవరు? 
ఆప్తులు. 
So వాళ్ళతో మీరు ఎలా మాట్లాడాలి? 
వాళ్ళ స్థితిని అర్థం చేసుకుని ఆప్తవాక్యంగా మాట్లాడాలి. 
అంతేగాని వ్యతిరేక భావాలతో ముందు భావన చేసావనుకో నీకు తెలియవచ్చు, వాళ్ళ దోషమేమిటో నీకు తెలియవచ్చు, కానీ కొబ్బరికాయి కొట్టినట్టు చెప్పావనుకో నెత్తిమీద, ఏమౌతుంది?      
వాళ్ళకి హృదయం బ్రద్ధలైనటువంటి, మనసు వికలమైనటువంటి స్థితి లోన అనుభూతమయ్యి, వాళ్ళకి దుఃఖం మరింత పెరుగుతుంది. 
దుఃఖం మరింత పెరిగి ఏం చేస్తారు? ఆ దుఃఖం ఎవరిమీద చూపెడుతారు? 
మనమీదే చూపెడుతారు. 

            కాబట్టి ఇద్దరి మధ్య సంబంధాలు, మానవ సంబంధాలు దెబ్బతింటాయన్నమాట. అందుకని ఆప్తవాక్యం చాలా అవసరం జీవితంలో. ఇది బాగా నేర్చుకోవాలి అందరూ కూడా. ఆప్తవాక్యాలు రానివాళ్ళు ఎవరైతే వుంటారో, వాళ్ళు జీవితాంతం కష్టాలు ఎక్కువ పడతారు. బాగా గుర్తుపెట్టుకోండి. మీలో ఎవరైనా సరే మా జీవితంలో కష్టాలు ఎక్కువ వున్నాయి అన్నవాళ్ళు వున్నారా? లేదా? నా జీవితమంతా కష్టాలే అన్నవాళ్ళందరికి ఒకటే సమస్య. ఏమిటి? ఆప్తవాక్యం తెలియదన్నమాట పాపం వాళ్ళకి. నిజాయితీగా సత్యమే చెప్తారు వాళ్ళు పాపం. కానీ ఎలా చెప్తారు? అప్రియం చెప్తారన్నమాట. అప్రియంగా చెప్పేటప్పటికి ఏమైపోయింది? ఆ దుఃఖం పెరిగిపోయింది. ఇదొక రకమైనటువంటి వాక్యాలు ఈ ఆప్తవాక్యాలు. 

            ఈ మూడు అసలు నిజానికి మాట్లాడితే, మీకు అవగాహన కలిగిస్తాయే తప్ప ముందుకు నడపవు. బాగా గుర్తుపెట్టుకోండి. సూచన వాక్యాలు, బోధ వాక్యాలు, ఆప్తవాక్యాలు ఈ మూడు మిమ్మల్ని నడిపేవి కావు అసలు. ఇవి కేవలం మీకు అవగాహనని కలిగిస్తాయి అంతే. నిజానికి సాధనకు సంబంధించిన వాక్యాలుంటాయి, అంటే ఇలా చెయ్యాలి.

            ఇప్పుడు మీ అబ్బాయికి మీరు అక్షరాభ్యాసం చేశారు, చేసి మీ అమ్మాయికి అక్షరాభ్యాసం చేశారు. ’ ‘ లు నేర్చుకోవాలి. ఏం చెయ్యాలి ’ ‘ లు నేర్చుకోవాలంటే? ఎందుకు ’ ‘ లే నేర్చుకోవాలండీ? మన సంప్రదాయంలో ఆ రెండు అక్షరాలే ఎందుకు పెట్టారు? ’ ‘ లే ఎందుకు పెట్టారు? ’ ‘ లు నిజానికి మాట్లాడితే 72 గంటలు పడుతుంది. ఆ రెండు అక్షరాలు నేర్చుకోవడానికి మొట్టమొదట పిల్లవానికి మూడురోజులు పడుతుంది. మూడు రోజులు ఆ రెండు అక్షరాలు బాగా అభ్యాసం చేసి బాగా వచ్చేస్తే, తరువాత రోజుకో అక్షరం నేర్చేసుకుంటాడు. ఎందువల్ల? (అభ్యాసబలం).  ఒకటి అభ్యాసబలం ఇంకా అకారో అక్షరాద్‌ ఉచ్యతే ఎందుకు చెప్పారయ్యా? నీవు అక్షరుడవు. కారం అనే అక్షరములో నీవు అక్షరము అనే జ్ఞానం వుంది. అది వాడు అనుకుంటూ దిద్దాలి. - అంటాం మనం.

– అంటూ దిద్దవయ్యా వస్తుందదే. వాడు రాదంటాడు. వాడేంచేస్తాడు, అనడండి అనకుండా దిద్దుతాడు. అనకుండా దిద్దితే రాదది. వారం దిద్దినా రాదు. - అనటం ద్వారా అకారో అక్షరాద్‌ ఉచ్యతే. నీవు అక్షరుడవు అనే జ్ఞానం మేల్కొంటుంది. అందువల్ల తరువాత అక్షరాలు తొందరగా వస్తాయి. - ఆకాశాత్‌ సంభూతాని నాయనా నీవు ఆకాశం నుంచి వచ్చావ్‌. ఈ భూమి మీద వున్నావ్‌ అనుకోమాక. నువ్వు ఆకాశం అవతలినుంచి వచ్చినవాడివయ్యా బాబు! ఆకాశం కంటే ముందున్నవాడివనే జ్ఞానాన్ని నీలో మేల్కొలుపుతుందన్నమాట. అందుకనే మొదలు ’ ‘ లే దిద్దమన్నారు. అర్థమైందా అండీ! దిద్దబెట్టేవాడు ఏం దిద్దబెడతాడు మొదట్లో? అక్షరాభ్యాసం రోజున ఏం చేస్తారండీ? 


ఓం నమః శివాయ సిద్ధం నమః

ఈ నేర్చుకునేవాడికి ఏమన్నా తెలుసా? అంటే నేర్పేవాడు ఏ స్థితిలో వుండి నేర్పుతున్నాడని అర్థం? ఓం నమః శివాయ సిద్ధం నమఃనీకు నేను బోధించాలి అంటే, నేను శివస్వరూపుడనై బోధించాలి. గురువు సాక్షాత్‌ శివస్వరూపుడు కాకపోయినట్లయితే, నీకు అక్షరాభ్యాసం చేసే అవకాశమే లేదు. అందుకని అక్షరాభ్యాసం ఎవరు చేయాలి? తండ్రే చేయాలా? తల్లైనా చేయవచ్చు. తల్లి తండ్రి భేదము లేదు సుమీ! ఒక వేళ తండ్రి లేకపోతే ఎవరు చేయాలి? తల్లి కూడా చేయవచ్చు. ఒక వేళ గనుక ఆవెడకు గనుక ఆ సందేహం వుంటే, ఇంకెవరైనా ఆచార్యుల దగ్గరకు వెళ్ళి ఆచార్యుని వద్ద చేయించవచ్చు. దోషం ఏమీ లేదు అందులో. తల్లీ తండ్రీ గురువు ముగ్గురు సమానమే. వాళ్ళు దైవ ప్రతినిధులు. ఈ భూమి మీద ఎవరైనా దైవాన్ని తెలుసుకోవాలంటే, ఈ ముగ్గురి దగ్గరే తెలుసుకోగలుగుతారు. ఈ ముగ్గురి దగ్గర ఎవరైతే ఈశ్వరుడిని గ్రహించలేకపోయారో, వారు దేశమంతా తిరిగినా, ఎన్ని క్షేత్రాలు తిరిగినా ఎప్పటికీ గ్రహించలేరు. తలబాదుకున్నా ఎప్పటికి అర్థం కాదది. అర్థమైందా అండీ! కాబట్టి ప్రత్యక్షంగా మీకు దైవీ భావన కలిగే అవకాశం వున్నది తల్లీ తండ్రీ గురవు. ఈ మూడు చోట్ల నీవు దైవీ భావనను పొందవచ్చు. కాబట్టి అక్షరాభ్యాసం చేసేటప్పుడు మాత్రం గురువు ఏ స్థితిలో వుండాలి? తానే శివస్వరూపుడు అయ్యి వుండాలి. నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని సిద్ధింపజేసుకున్నటువంటి, సాక్షాత్‌ శివమూర్తియై వుండాలి. ఆ శివమూర్తియై వున్నవాడు మాత్రమే, నీకు అక్షరాభ్యాసం చేసినప్పుడు, నువ్వేమౌతావ్‌? ఆ శివ స్వరూపుడవే అవుతావు.             కాబట్టి ఎవరెవరైతే మీరు గురువును ఆశ్రయించారు అనుకుంటున్నారో, గురువును శివస్వరూపుడిగా భావించి, వారి వద్దనుంచి ఆ విజ్ఞానాన్ని మీరు గ్రహించి, మీరందరూ ఈ జీవితంలోనే శివస్వరూపులుగా పరిణామం చెంది, ఆ స్థితిలో మీరు జీవించి, ఆ స్థితిలో మిమ్మల్ని మీరు ఈ జీవభావాల నుంచి బయటపడవేసుకునేటువంటి ఉత్తమవిద్యను గ్రహించడం కోసమే మీరు ఈ గురుపౌర్ణమి అనే అభ్యాసాన్ని చేపట్టారు. అలా మీరందరూ అవుతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందులకు ధన్యవాదాలు.

ఓం శాంతిః శాంతిః శాంతిః
ఓం తత్‌ సత్‌